కేపీహెచ్బీ కాలనీలో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్

26-11-2020 Thu 15:23
  • కేపీహెచ్ బీ 9వ ఫేజ్ లో ఉద్రిక్తత
  • అడ్డుకున్నంత మాత్రాన గెలిచినట్టు కాదన్న టీడీపీ
  • ఓటమి భయంతోనే అడ్డుకున్నారని మండిపాటు
TRS followers stopped TDP election campaigning

గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనున్న తరుణంలో హైదరాబాద్ నగరం ఆయా పార్టీల ప్రచారాలతో మారుమోగుతోంది. తాజాగా కేపీహెచ్ బీ డివిజన్ లో టీడీపీ ప్రచారాన్ని టీఆర్ఎస్ అడ్డుకుంది. ఈ డివిజన్ లో టీడీపీ తరపున పద్మా చౌదరి, టీఆర్ఎస్ తరపున మందడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. కేపీహెచ్ బీ 9వ ఫేజ్ లో పద్మా చౌదరి కూతురు ప్రియదర్శిని, ఇతర నేతలు ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.

అదే ప్రాంతంలో మందడి నివాసం ఉండటంతో ప్రచారాన్ని ఆపేసి వెళ్లిపోవాలని టీడీపీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్గీయులు చెప్పారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరి కూడా అక్కడకు చేరుకున్నారు. ప్రచారాన్ని అడ్డుకున్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచినట్టు అనుకుంటున్నారా? అని ఆమె మండిపడ్డారు. గతంలో మందడి ఏ పార్టీ గుర్తుతో గెలిచారో గుర్తుకు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఓడిపోతోందనే భయంతోనే టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారని చెప్పారు.