Telangana DGP: బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశాం: డీజీపీ మహేందర్ రెడ్డి
- ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం
- కొందరు నేతలు రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారు
- విద్వేషాలు రగిల్చేందుకు యత్నిస్తున్నారనే సమాచారం మా వద్ద ఉంది
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కొందరు నేతల ప్రసంగాలు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. నేతల ప్రసంగాలను పరిశీలిస్తున్నామని, విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న నేతలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని డీజీపీ అన్నారు. గత ఆరేళ్లలో నగరంలో ఎలాంటి ఘటనలు జరగలేదని... కానీ, ఇప్పుడు విద్వేషాలను రగిల్చేందుకు కొందరు యత్నిస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సోషల్ మీడియా పోస్టులపై కూడా నిఘా పెట్టామని... అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రేటర్ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లలో 51,500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని చెప్పారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించేందుకు పోలీసు బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.