ఎన్టీఆర్, పీవీల పేర్లను తుచ్ఛ రాజకీయాల కోసం వివాదాస్పదం చేయడం బీజేపీ, ఎంఐఎంలకే చెల్లింది: రేవంత్

25-11-2020 Wed 21:52
  • అక్బర్ నోట ఎన్టీఆర్, పీవీ ఘాట్ల మాట
  • దీటుగా కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్
  • ఇలాంటి పార్టీలు మనకు అవసరమా? అంటూ రేవంత్ ట్వీట్
Revanth Reddy comments on NTR and PV ghats issue

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎన్టీఆర్, పీవీ నరసింహారావులకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇప్పుడీ మహనీయుల పేర్లు చర్చకు వస్తున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోందని, అలాగైతే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీల సమాధులను కూడా కూలగొట్టాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుదీన్ ఒవైసీ పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు తెలుగు వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని విశ్వవేదికపై చాటిన మహానేతలు అని వ్యాఖ్యానించారు. అలాంటి మహనీయుల పేర్లను తుచ్ఛ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేయడం బీజేపీ, ఎంఐఎంలకే చెల్లిందని విమర్శించారు. ఇలాంటి పార్టీలు మనకు అవసరమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.