ఏపీ రాజధాని అమరావతిలోనే.... ఇవి నా నోటి నుంచి వచ్చిన మాటలు కావు, జేపీ నడ్డానే చెప్పారు: పవన్ కల్యాణ్ 

25-11-2020 Wed 20:53
  • ఢిల్లీలో జేపీ నడ్డాతో పవన్ భేటీ
  • అమరావతి, పోలవరం అంశాలపై చర్చ
  • పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన నడ్డా
Pawan Kalyan talks to media after met JP Nadda

ఢిల్లీలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ-జనసేన నిర్ణయం అని ఉద్ఘాటించారు. రాజధానిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.

బీజేపీ-జనసేన కూటమి రాజధాని రైతుల పక్షానే నిలుస్తుందని, ఇవి తన నోటి నుంచి వచ్చిన మాటలు కాదని, జేపీ నడ్డానే చెప్పారని పవన్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా నడ్డాతో మాట్లాడామని పేర్కొన్నారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతూ ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకున్నందుకు పవన్ కల్యాణ్ కు జేపీ నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వివరించింది.