మా ఇద్దరినీ కూర్చోబెట్టి జగన్ మాట్లాడారు: పిల్లి సుభాష్ చంద్రబోస్

25-11-2020 Wed 20:18
  • పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి మధ్య గొడవ
  • తీవ్ర పదజాలంతో దూషించుకున్న వైసీపీ నేతలు
  • తాడేపల్లికి పిలిపించుకున్న జగన్
Jagan spoke to both of us says Pilli Subhas Chandra Bose

తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ మీటింగ్ లో వైసీపీ నేతల మధ్య లుకలుకలు రచ్చకెక్కాయి. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఇద్దరూ జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఒకరిపై మరొకరు దూషణకు దిగారు. తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఈ గొడవ ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకోవద్దని ఇద్దరికీ హితవు పలికారు.

జగన్ తో సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ, తమ ఇద్దరినీ కూర్చోబెట్టి జగన్ మాట్లాడారని చెప్పారు. డీఆర్సీ సమావేశంలో జరిగిన గొడవ టీ కప్పులో తుపాను వంటిదని అన్నారు. ఆవేశంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పారు. తాను ఆవేశపరుడిని కాదని అన్నారు.

టీడీపీ హయాంలో కాకినాడ మేడలైన్ వంతెన విషయంలో అవినీతి జరిగిందనే విషయాన్ని సీఎంకు చెప్పానని పిల్లి తెలిపారు. తన అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్టును తెప్పించమని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. శిరోముండనం కేసు విషయం జగన్ వద్ద ప్రస్తావనకు రాలేదని తెలిపారు.