జగన్ సర్కారుకు ఊరట... ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే

25-11-2020 Wed 19:32
  • దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్
  • సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు
  • సుప్రీంలో ఏపీ సర్కారుకు ఊరట
Supreme Court issues stay on AP High Court Gag Order

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసుకు సంబంధించి మీడియాలో కథనాలు ప్రసారం చేయరాదంటూ ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు.

అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని, బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారని, దీనిపై విచారణ జరగాలని అన్నారు. తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, మీడియాపై ఆంక్షలు విధిస్తూ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారని, పిటిషనర్ కోరకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఇక, దమ్మాలపాటి తరఫున దిగ్గజ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. దమ్మాలపాటి శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్ గా పనిచేశారని, అందుకే ఈ కేసులో ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపించారు. రాజధానిలో భూములు కొనే సౌలభ్యం అందరికీ ఉంటుందని, కొనుగోళ్లు చేయొద్దని ఎలా అంటారని వ్యాఖ్యానించారు. రాజధాని అనేది రహస్యం కాదని, దానికి సంబంధించిన కథనాలు మీడియా అంతటా వచ్చాయని వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ కేసులో తుది నిర్ణయం తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టుకు స్పష్టం చేసింది.