Roja: తన సొంతవాళ్లున్న చోటే ఓడిపోయిన వ్యక్తి తిరుపతిలో ఏం చేస్తాడు?: పవన్ కల్యాణ్ పై రోజా వ్యాఖ్యలు

  • తిరుపతిలో తమదే విజయమంటూ రోజా ధీమా
  • మోదీ భజనసేన పార్టీ అంటూ ప్రస్తావన
  • మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోనని సందేహం
Roja comments on Janasena supremo Pawan Kalyan

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని స్పష్టం చేశారు. నిజంగా అది జనసేన పార్టీయా, లేక కేటీఆర్ గారు అన్నట్టు మోదీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. ఎందుకంటే తన పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని, ఏంజరిగినా తాను చూసుకుంటానని అన్నారని వెల్లడించారు. కానీ ఈ రాష్ట్రం అతలాకుతలం అయిందని, మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు అయ్యాయని రోజా పేర్కొన్నారు.

"అనేక సమస్యలకు చంద్రబాబు కారణం అయినా, ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ గారు ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదు. ఇవాళ గ్రేటర్ ఎన్నికల్లో చూస్తే బీజేపీ కోసం జనసేన తప్పుకుంది. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి వైదొలిగారు. ఇప్పుడు తిరుపతికొచ్చి పోటీచేస్తున్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడు? తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా? గ్రేటర్ లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారా?" అని రోజా ప్రశ్నించారు.

More Telugu News