Andhra Pradesh: న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల కేసు: నిందితుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ

 case of objectionable posts on the judiciary CBI is busy investigation

  • ఐపీ అడ్రస్‌లు తెలుసుకునేందుకు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు లేఖలు
  • అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 107 మంది వివరాలను సీబీఐకి అప్పగించిన న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ
  • 93 మందిపై ప్రత్యక్ష విచారణకు హైకోర్టు ఆదేశం

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. న్యాయవ్యవస్థపైన, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపైనా చేసిన అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు ఏయే ఐపీ అడ్రస్‌ల నుంచి వచ్చాయన్న దానిపై సీబీఐ ఆరా తీస్తోంది. వివరాలు తెలుసుకునేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లకు లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభం కానుందని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో తాము పెట్టిన పోస్టులను నిందితులు తొలగించారు. దీంతో వాటికి సంబంధించిన ఫుట్‌ప్రింట్స్‌ను సీబీఐ విశ్లేషించనుంది.

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సీఐడీ నమోదు చేసిన 12 కేసులను కలిపి ఒకే ఎఫ్ఐఆర్‌గా నమోదు చేసిన సీబీఐ.. మొత్తం 17 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో విదేశాల్లో ఉన్న కిశోర్‌రెడ్డి దరిశ, మణి అన్నపురెడ్డి, లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిలకు విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేయనుంది. మరోవైపు, న్యాయమూర్తులపై అనుచిత పోస్టులపై గతంలో హైకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ తాజాగా సీబీఐ విచారణకు హాజరై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 107 మంది వివరాలను అందించారు. వీరంతా అధికార పార్టీ అనుచరులు, అనుకూలురని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అయితే, వీరంతా ఎవరికి వారే పోస్టులు చేశారా? లేక, ఇలా పోస్టులు చేయాలంటూ ఎవరి నుంచైనా ఆదేశాలు అందాయా? అన్న విషయాన్ని సీబీఐ తేల్చే పనిలో పడింది. ఇదిలా ఉండగా, అభ్యంతరకర పోస్టింగులు, చర్చలు జరిపిన 93 మందిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై ప్రత్యక్ష విచారణ జరపాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు నిన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ 93 మందిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News