BMW Car: రూ. 90 లక్షల బీఎండబ్ల్యూ కారు.. తరచూ సమస్యలు రావడంతో చెత్తబండిగా మార్చిన వ్యాపారవేత్త!

  • కారులో తరచూ సమస్యలు
  • విసిగిపోయి చెత్త బండిగా మార్చిన యువ వ్యాపారవేత్త శ్రీవాస్తవ
  • తనతోపాటు క్రికెటర్లు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని ఆవేదన
bmw luxury carrying car garbage jharkhand ranchi

కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారులో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో విసిగిపోయిన ఓ వ్యాపారవేత్త దాంట్లో చెత్త ఏరుతూ నిరసన వ్యక్తం చేశాడు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈ ఘటన జరిగింది. నగరానికి చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ శ్రీవాస్తవ తన తండ్రికి బహుమానంగా ఇచ్చేందుకు రూ. 90 లక్షలు ఖర్చు చేసి బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. కారుతోపాటే సమస్యలు కూడా కొనితెచ్చుకున్నాడు. కారులో తరచూ ఏదో ఒక సమస్య బయటపడుతుండడంతో సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగడం తప్ప మరో పని లేకుండా పోయింది.

ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా మరో కొత్త సమస్య బయటపడుతోంది. దీంతో షోరూంకు తీసుకెళ్లడానికి అతడికి, దానిని మరమ్మతు చేయలేక షోరూం సిబ్బందికి విసుగొచ్చింది. దీంతో విసిగిపోయిన శ్రీవాస్తవ ఇలా లాభం లేదనుకుని లక్షలు పోసి కొన్న కారును చెత్త బండిగా మార్చేసి బీఎండబ్ల్యూ కంపెనీపై నిరసన వ్యక్తం చేశాడు. వీధుల్లో చెత్తను ఏరి దానిని కారు డిక్కీలో నింపుతూ నిరసన తెలిపాడు.

అంతేకాదు, ‘చెత్తబండి వచ్చింది చెత్త తీసుకురండి’ అంటూ పెద్ద శబ్దంతో పాటలు కూడా పెడుతుండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి సమస్యలు తానొక్కడినే ఎదుర్కోవడం లేదని, ఇలాంటి కారే కొనుగోలు చేసిన క్రికెటర్లు ఇషాన్ కిషన్, అజాతశత్రు సింగ్ కూడా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని అన్నారు. త్వరలోనే కంపెనీపై కోర్టుకు వెళ్తానని తెలిపారు.

More Telugu News