KCR: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!
- అన్ని పడకలకూ ఆక్సిజన్ సౌకర్యం
- అదనంగా మరో 5 వేల పడకల ఏర్పాటు
- మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని సూచన
- కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న సంకేతాలు కనిపిస్తున్న వేళ, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని పడకలకూ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేల పడకలు ఉండగా, 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉందన్న విషయం తెలిసిందే. వందకు పైగా పడకలు ఉన్న హాస్పిటల్స్ కు లిక్విడ్ ఆక్సిజన్ ను, మిగతా హాస్పిటల్స్ కు సాధారణ ఆక్సిజన్ ను సరఫరా చేయాలని పేర్కొంది.
అన్ని ఆసుపత్రుల్లో కలిపి మరో 5 వేల అదనపు పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, మరోమారు ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.