East Godavari District: డీఆర్‌సీ సమావేశంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం.. అర్ధాంతరంగా ముగిసిన మీటింగ్!

Leaders use choicest abuses in DRC meeting

  • జిల్లా సమీక్ష కమిటీ సమావేశం రసాభాస
  • టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందన్న ఎంపీ పిల్లి సుభాష్
  • ఖండిస్తూ వాగ్వివాదానికి దిగిన ద్వారంపూడి
  • టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావును పక్కకు నెట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిన్న నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం సందర్భంగా అధికార వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. సమావేశంలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపించారు.

వెంటనే అదే పార్టీ పార్టీకి చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందని చెప్పడంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ద్వారంపూడి.. జోగేశ్వరరావును పక్కకు నెట్టేశారు.

ఆ తర్వాత మేడలైను వంతెన నిర్మాణం విషయంలో సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి మధ్య మరోమారు వాగ్వివాదం జరిగింది. ఈ వంతెన నిర్మాణం వల్ల కాకినాడ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి వంతెన నిర్మాణాన్ని నిలిపివేయాలని సుభాష్ చంద్రబోస్ కోరారు.

దీనిపైనా ద్వారంపూడి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ ఇద్దరు నేతలు నోటికి పనిచెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నట్టు కనిపించడంతో డీఆర్‌సీ సమావేశాన్ని కలెక్టర్ అర్ధాంతరంగా ముగించారు. కాగా, సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంపీ, ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News