Mohammed Siraj: ఇవాళ మీ నాన్న, రేపు నేను.. ఏదో ఒకరోజు అందరం పోవాల్సిందే... నాన్న కల నెరవేర్చు: పేసర్ సిరాజ్ కు తల్లి కర్తవ్యబోధ

  • టీమిండియా పేసర్ సిరాజ్ కు పితృవియోగం
  • భారత్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్న బీసీసీఐ
  • తాను ఆస్ట్రేలియాలోనే ఉంటానన్న సిరాజ్
  • తాజాగా వీడియోలో సందేశం
Teamindia pacer Mohammed Siraj explains what his mother said to him

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ (53) కొన్నిరోజుల కిందట హైదరాబాదులో మరణించారు. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని బీసీసీఐ చెప్పినా, సిరాజ్ భారత జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను టీమిండియాకు ఆడాలన్నది తన తండ్రి కోరిక అని, ఆయన కోరిక ప్రకారం దేశం తరఫున క్రికెట్ ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించి తన స్ఫూర్తిని చాటాడు.

తాజాగా, ఓ వీడియోలో సిరాజ్ మాట్లాడుతూ, తన తల్లి ఏంచెప్పిందో వివరించాడు. "ఇవాళ మీ నాన్న, రేపు నేను... అందరం ఏదో ఒకరోజు పోవాల్సిందే. నాన్న కల నెరవేర్చు. నాన్న కోసం భారత్ తరఫున మెరుగైన క్రికెట్ ఆడు అని చెప్పింది. ఈ కష్ట సమయంలో మా అమ్మ నాకెంతో ధైర్యం నూరిపోసింది" అని వివరించాడు. ఈ లోకంలో లేనప్పటికీ తన తండ్రి ఎల్లప్పుడూ దగ్గరగానే ఉన్నట్టు భావిస్తానని తెలిపాడు.

తండ్రి మరణం తీర్చలేని లోటు అని, అయితే టీమిండియా సభ్యులు తనను ఓదార్చిన తీరు పట్ల వారి రుణం తీర్చుకోలేనని సిరాజ్ పేర్కొన్నాడు. జట్టు సహచరులు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని వెల్లడించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో మద్దతు ఇస్తున్నాడని, ఈ కష్టకాలంలో గుండె నిబ్బరం చేసుకుని నిలబడితే మున్ముందు అదెంతో సాయపడుతుందని కోహ్లీ పేర్కొన్నాడని వివరించాడు.

More Telugu News