భారత క్రికెట్ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఓఏ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ

22-11-2020 Sun 20:59
  • క్రికెట్ పెద్దల్లో బంధుప్రీతి ఉందన్న గుహ
  • శ్రీనివాసన్ అల్లుడు బెట్టింగ్ రాయుడని వెల్లడి
  • అమిత్ షా తనయుడికి కీలక పదవి లభించిందన్న గుహ
  • గంగూలీపైనా వ్యాఖ్యలు చేసిన గుహ
COA former member Ramachandra Guha comments on Indian cricket top brass

కొన్నాళ్ల కిందట భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీఓఏ సభ్యుడిగా వ్యవహరించిన రామచంద్ర గుహ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు భారత క్రికెట్ ఎన్.శ్రీనివాసన్, అమిత్ షాల చేతిలో ఉందని, వారే దేశంలో క్రికెట్ ను శాసిస్తున్నారని ఆరోపించారు.

బంధుప్రీతితో వ్యవహరిస్తున్నారని, కుట్రలు, అస్మదీయుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల క్రికెట్ సంఘాలను ఎవరి కుమారుడో, ఎవరి కుమార్తెనో నడిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, రంజీ ఆటగాళ్ల బకాయిలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ఇంతక్రితం క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్నాడని, అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐలో కార్యదర్శి అని వివరించారు.

రామచంద్ర గుహ ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. గంగూలీ బీసీసీఐ చీఫ్ గా ఉన్నా, ఓ క్రికెట్ ఫాంటసీ గేమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, మనదేశ ఆటగాళ్లలో డబ్బు కోసం ఇలాంటి దురాశ దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.