వీఆర్ఎస్ ఇప్పించాలంటూ సీఎం జగన్ ను అర్థించిన కానిస్టేబుల్... వీడియో వైరల్

22-11-2020 Sun 17:10
  • డాగ్ స్క్వాడ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు
  • తనను అన్యాయంగా బదిలీ చేశారని వెల్లడి
  • కొన్ని కుక్కలు అనారోగ్యంతో ఉన్నట్టు వివరణ
  • అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వ్యాఖ్యలు
Vijayawada dog handler video went viral

విజయవాడ ఏఆర్ పోలీసు విభాగంలో జాగిలాల సంరక్షకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే హెడ్ కానిస్టేబుల్ తనకు వీఆర్ఎస్ ఇప్పించాలంటూ సీఎం జగన్ ను అర్థిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. కొన్ని కారణాలతో పోలీసు శాఖలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని, తనకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని కల్పించాలని శ్రీనివాసరావు తన వీడియోలో విజ్ఞప్తి చేశాడు.

ఏఆర్ విభాగంలో డాగ్ స్క్వాడ్ లో సేవలు అందిస్తున్న శ్రీనివాసరావు.... ఇటీవల అధికారులు తనను హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారని ఆరోపించారు. అన్యాయంగా బదిలీ చేశారని తెలిపారు. తన విభాగంలో అనేక జాగిలాలు అనారోగ్యంతో ఉన్నాయని చెప్పానని, వాటికి శిక్షణ కూడా సరైన విధంగా ఇవ్వడంలేదన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. కొన్ని జాగిలాలు పేలుడు పదార్థాలను గుర్తించలేని స్థితిలో ఉన్నట్టు అధికారులకు నివేదించినా పట్టించుకోలేదని ఆరోపించారు.