COVAXIN: వ్యాక్సిన్ ట్రయల్స్ లో ప్రతికూల ఘటన నిజమే... అంగీకరించిన భారత్ బయోటెక్!
- కోవాగ్జిన్ పేరిట కరోనా టీకా
- తొలి దశ ట్రయల్స్ లో ప్రతికూల ఘటన
- అది టీకా వల్ల కాదన్న భారత్ బయోటెక్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, కోవాగ్జిన్ పేరిట కరోనా టీకాను తయారు చేసి, ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్, తన ట్రయల్స్ లో ప్రతికూల ఘటన ఒకటి జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొంది. అయితే, ఈ ఘటన గురించి 24 గంటల్లోనే రిపోర్ట్ చేశామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ బయోటెక్ తొలి దశ టీకా ట్రయల్స్ లో జరిగిన ప్రతికూల ఘటన గురించి సంస్థ రిపోర్ట్ చేయలేదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన భారత్ బయోటెక్, "ఆగస్టులో జరిగిన ఈ ఘటన గురించి సీడీఎస్సీఓ - డీజీసీఐకి 24 గంటల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చాము.అయితే ఇది వ్యాక్సిన్ కారణంగా జరుగలేదు" అని స్పష్టం చేసింది. ఈ టీకాను భారత్ బయోటెక్ తో పాటు ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కు ఇప్పటికే అనుమతులు లభించాయి.