పాఠశాలల మూసివేతతో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం: యూనిసెఫ్

22-11-2020 Sun 09:18
  • పాఠశాలల మూసివేత వల్ల జీవితంలో అత్యంత గొప్ప క్షణాలను కోల్పోతున్నారు
  • నేర్చుకునే ప్రక్రియకు విఘాతం కలుగుతోంది
  • దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం
schools closure can lead to mental health difficulties in children

కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు తెరుచుకోలేదు. విద్యాసంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది స్పష్టత లేకపోవడంతో చాలా వరకు పాఠశాలలు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతున్నాయి. అయితే, పాఠశాలల మూసివేత కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ తెలిపింది.

కొవిడ్ నేపథ్యంలో బాల్యం, కౌమారదశల్లో ఉన్న చిన్నారుల్లో 70 శాతం మందికి మానసిక ఆరోగ్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కౌమార దశలో ఉన్న వారిలో మానసిక సమస్యలు వృద్ధి చెందుతున్నాయని,  పాఠశాలల మూసివేత, పరీక్షల వాయిదా వల్ల సహచరుల మద్దతును, వారి జీవితంలో అత్యంత గొప్ప క్షణాలను వారు కోల్పోతున్నారని యూనిసెఫ్ నివేదిక వివరించింది.

పాఠశాలలు ఎంత కాలంపాటు మూతపడితే, అంత ఎక్కువగా నేర్చుకునే ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తెలిపింది. దీర్ఘకాలంలో ఇది వారి ఆదాయం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని యూనిసెఫ్ తన నివేదికలో పేర్కొంది.