బెల్లంకొండ హిందీ సినిమాకి దర్శకుడిగా వీవీ వినాయక్?

21-11-2020 Sat 21:50
  • ప్రభాస్ 'ఛత్రపతి' హిందీలో రీమేక్ 
  • బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ
  • దర్శకుడిగా సుజిత్ పేరు ప్రచారం
  • తాజాగా వినాయక్ తో సంప్రదింపులు
V V Vinayak to direct Bellamkondas Hindi movie

తెలుగులో టాప్ హీరోలందరితోనూ హిట్ సినిమాలు చేసి, అగ్రశ్రేణి దర్శకుడిగా రాణించిన వీవీ వినాయక్ కి మాస్ చిత్రాల డైరెక్టర్ గా కూడా పేరుంది. మాస్ ఎంటర్ టైనర్ లు రూపొందించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. అయితే, ఇటీవలి కాలంలో ఆయన దర్శకుడిగా కాస్త వెనుకపడ్డాడనే చెప్పాలి. ఈ తరుణంలో ఆయన తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'ఛత్రపతి' చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ చిత్రం ద్వారా యంగ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా నిన్నటివరకు 'సాహో' ఫేమ్ సుజిత్ పేరు వినిపించింది. అయితే, ఇందులో వాస్తవం లేదని ఆయన చెప్పాడు.

ఈ క్రమంలో 'అల్లుడు శీను' సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ ను గతంలో వెండితెరకు పరిచయం చేసిన వినాయక్ ఈ హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడంలోనూ, రీమేక్స్ చేయడంలోనూ వినాయక్ కున్న టాలెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజక్టుకి ఆయనని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి, ఇది కార్యరూపం దాలుస్తుందేమో చూద్దాం!