DK Shivakumar: అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్ కు సీబీఐ సమన్లు
- సమన్లు అందాయని చెప్పిన శివకుమార్
- 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు
- 24వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పిన డీకే
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో నోటీసులు అందించింది. తనకు సీబీఐ నుంచి సమన్లు అందాయని శివకుమార్ స్వయంగా చెప్పారు. ఈ నెల 25న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. తనకు సమన్లు అందిన విషయం నిజమేనని చెప్పారు. సీబీఐ అధికారులు నిన్న తమ ఇంటికి వచ్చారని... అయితే ఆ సమయంలో తాము తమ కుటుంబ కార్యక్రమంలో మరోచోట ఉన్నామని తెలిపారు. దీంతో, మరుసటి రోజు మళ్లీ వచ్చి సమన్లు ఇచ్చారని అన్నారు.
23వ తేదీ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని సమన్లలో సీబీఐ పేర్కొందని శివకుమార్ చెప్పారు. అయితే మాస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయని... దీంతో తాను, సిద్ధరామయ్య 23న అక్కడ పర్యటించనున్నామని... అందువల్ల ఆరోజు విచారణకు వెళ్లలేనని తెలిపారు. దీంతో 25న విచారణకు వస్తానని సీబీఐ అధికారులకు ఫోన్ చేసి చెప్పానని, వారు అంగీకరించారని వెల్లడించారు.
ఈ నెల 19న శివకుమార్ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మనవడు సిద్ధార్థతో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం యడియూరప్ప కూడా హాజరయ్యారు.