మజ్లిస్ తో స్నేహంలేదు... విధానపరమైన నిర్ణయాల వరకే మద్దతు: కేటీఆర్

21-11-2020 Sat 18:56
  • జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్
  • గతంలో మజ్లిస్ తమకు పోటీగా అభ్యర్థులను నిలిపిందన్న కేటీఆర్
  • పాతబస్తీలో తాము 5 స్థానాలు గెలిచామని వెల్లడి
KTR clarifies no friendly ties with MIM

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రెట్టించిన ఉత్సాహంతో గ్రేటర్ బరిలో దిగిన బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు సమీకరిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ తో తమకు స్నేహపూర్వక ఒప్పందాలేవీ లేవని, మజ్లిస్ మద్దతు విధానపరమైన నిర్ణయాల వరకేనని స్పష్టం చేశారు. తాము ఇదే విధంగా గతంలో బీజేపీకి కూడా విధానపరమైన మద్దతు ఇచ్చామని వెల్లడించారు.

ఇంతకుముందు తాము మజ్లిస్ పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థులను నిలిపామని, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ లో తమపై మజ్లిస్ పోటీకి దిగిందని కేటీఆర్ వివరించారు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో టీఆర్ఎస్ కు 5 స్థానాలు లభించాయని చెప్పారు. చరిత్ర ఇలావుంటే ఎంఐఎంతో స్నేహపూర్వక ఒప్పందం ఎక్కడుందని ప్రశ్నించారు.