Singireddy Niranjan Reddy: జనం లేని సేన, సేన లేని సేనాని: పవన్ కల్యాణ్ పై మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు
- బీజేపీ, జనసేన పార్టీలపై నిరంజన్ రెడ్డి ధ్వజం
- తెలంగాణను కించపరిచారంటూ బీజేపీ నేతలపై ఆగ్రహం
- పవన్ ను ఏపీలో ఛీకొట్టారంటూ వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. తెలంగాణపై అవమానకర రీతిలో మాట్లాడిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. పార్లమెంటులో తలుపులు మూసేసి బిల్లును ఆమోదించి, తల్లిని చంపి బిడ్డను కన్నది అంటూ తెలంగాణను కించపరిచే వ్యాఖ్యలు చేసింది బీజేపీ నేతలు కాదా అని నిలదీశారు.
"అలాంటి బీజేపీ నేతలకు నాయకుడు ప్రధాని మోదీ. వాళ్లు ఇవాళ జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఆ పార్టీ నాయకుడ్ని ఆంధ్రప్రదేశ్ లో ఛీకొట్టారు. తెలంగాణ ఇచ్చినందుకు తాను 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన నాయకుడు ఆయన. ఆయనకు తెలంగాణపై అంతగొప్ప ప్రేమ ఉంది. అది జనం లేని సేన, ఆయన సేనలేని సేనాని. తెలంగాణపై తమ విషాన్ని కక్కడానికే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాక్షేమం కోసం బేషరతుగా ఎన్నికల బరి నుంచి విరమించుకుంటున్నాం అని చెప్పారు. ఏ ప్రజల క్షేమం కోసం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారో చెప్పాలి" అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.