బీజేపీలో చేరనున్న కత్తి కార్తీక

21-11-2020 Sat 16:50
  • కిషన్ రెడ్డితో భేటీ అయిన కత్తి కార్తీక
  • మర్యాదపూర్వకంగా కలిశానన్న బిగ్ బాస్ ఫేమ్
  • రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తానని వ్యాఖ్య
Anchor Kathi Karthika to join BJP

టీవీ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బీజేపీలో చేరబోతున్నారు. ఈరోజు ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించారు. అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. మర్యాదపూర్వకంగా తాను కిషన్ రెడ్డిని కలిశానని... రెండు, మూడు రోజుల్లో పార్టీలో చేరడంపై అధికారికంగా ప్రకటన చేస్తానని చెప్పారు.

దుబ్బాక ఉపఎన్నికలో కత్తి కార్తీక పోటీ చేశారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను అడ్డుకోవడానికి యత్నించారని, ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా నిలవాలనే తాను ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో కత్తి కార్తీకకు 630 ఓట్లు వచ్చాయి.