మహిళను తుపాకీతో బెదిరించి బంగారు చైన్ లాక్కెళ్లిన దొంగలు.. వీడియో విడుదల చేసిన పోలీసులు

21-11-2020 Sat 14:30
  • పెళ్లికి వెళ్లి వస్తుండగా మహిళను బెదిరించిన దొంగలు
  • క్రైమ్ లో ఇద్దరు పాల్గొన్నారన్న పోలీసులు
  • సీసీటీవీలో విజువల్స్ లభ్యం
Man With Gun Snatches Womans Gold Chain In Delhi

దేశ రాజధాని ఢిల్లీలో క్రైమ్ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. కిడ్నాపులు, హత్యలు, మానభంగాల వంటిని అక్కడ అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరో ఘటన కలకలం రేపింది. ఓ మహిళను తుపాకీతో బెదిరించిన దొంగ... ఆమె నుంచి బంగారు చైన్ ను లాక్కెళ్లాడు. నిన్న (శుక్రవారం) మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ క్రైమ్ లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. విజువల్స్ లో ఉన్న వ్యక్తి ఇద్దరిలో ఒకడు. ఈ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూర్పు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ కెమెరాల ఫీడ్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితురాలు లక్ష్మి ఒక పెళ్లికి వెళ్లి ఒంటరిగా తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దొంగలు ఆమె చైన్ ను లాక్కెళ్లారు. వెంటనే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.