పెళ్లి మంటపానికి ప్రియుడిని పిలిపించిన పెళ్లికూతురు... చిత్తూరు జిల్లాలో ఘటన!

21-11-2020 Sat 13:36
  • తాళి కట్టడానికి గంట ముందు షాకిచ్చిన వధువు
  • ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ రచ్చ
  • ప్రియుడితో పెళ్లి జరిపించిన పోలీసులు
Bride calls her lover to Kalyanamantapam

కాసేపట్లో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లికూతురు అక్కడున్న అందరికీ షాకిచ్చింది. తన ప్రియుడిని రంగంలోకి దించి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లికి అంతా సిద్ధమైంది. పెళ్లి పీటల మీద క్రతువు జరుగుతోంది. బాజాభజంత్రీలు మోగుతున్నాయి. కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా... తనకు ఈ పెళ్లి వద్దంటూ పెళ్లికూతురు మొండికేసింది.

 దాంతో, అక్కడున్న వారంతా షాకయ్యారు. పెళ్లికొడుకుతో తనకు పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, అక్కడకు తన ప్రియుడిని కూడా రప్పించింది. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పెళ్లిమంటపానికి వచ్చి పెద్దలతో చర్చించారు. అనంతరం ఎమ్మార్వో సమక్షంలో ప్రియుడితో ఆమెకు పెళ్లి జరిపించారు. పెళ్లి కూతురు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. తన ప్రియుడితో ఆమెకు అక్కడే పరిచయం ఏర్పడింది. పెళ్లి అనంతరం కొత్త జంట ఇద్దరూ చెన్నైకి వెళ్లిపోయారు.