vaccine: నాలుగేళ్లలో భారతీయులందరికీ వ్యాక్సిన్ అందుతుంది: ఎస్‌ఐఐ సీఈఓ పూనావాలా

  • ఫిబ్రవరిలో మొదట వైద్యారోగ్య సిబ్బందికి
  • ఏప్రిల్‌ నుంచి సాధారణ ప్రజలకు
  • రెండు వ్యాక్సిన్‌ డోసులకు దాదాపు రూ.1,000
vaccine reach by 2024

కరోనా విజృంభణ వేళ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోన్న నేపథ్యంలో కొన్ని వ్యాక్సిన్లు వినియోగానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, అవి భారత్‌కు చేరడం, అవి దేశంలోని అందరికీ అందడం ఎప్పుడనే విషయంపై పూణెకి చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదార్‌ పూనావాలా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని చేసేందుకు ‘సీరం’ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  దేశంలో 2024కల్లా ప్రతి ఒక్కరికీ ఆ వ్యాక్సిన్ అందుతుందని పూనావాలా తెలిపారు.

మొదట ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ దేశంలోని‌ వైద్యారోగ్య సిబ్బందికి, వృద్ధులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా అందుతుందని చెప్పారు. అనంతరం ఏప్రిల్‌ నుంచి సాధారణ ప్రజలకు దాని పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. రెండు వ్యాక్సిన్‌ డోసులకు దాదాపు రూ.1,000 ఖర్చు అవుతుందని చెప్పారు.

దేశంలోని అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు దాదాపు నాలుగు సంవత్సరాలు పడుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ సరఫరాతో పాటు పంపిణీల్లో ఉండే పరిమితులు, బడ్జెట్‌, మౌలిక సదుపాయాలు వంటి అంశాలే ఇందుకు కారణమని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని వ్యాక్సిన్ల ధరల కంటే తమ వ్యాక్సిన్ ధరే తక్కువని ఆయన తెలిపారు.

More Telugu News