జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో చెప్పిన నటుడు పోసాని కృష్ణమురళి

21-11-2020 Sat 12:50
  • టీఆర్ఎస్ కే ఓటు వేయండి
  • టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ చేయండి
  • కేసీఆర్ వల్లే హైదరాబాద్ ప్రజలు సురక్షితంగా ఉన్నారు
Posani Krishna Murali says he support TRS

ఏ ఎన్నికలు వచ్చినా సినీ నటుల హడావుడి కొంత మేర కనిపిస్తూనే ఉంటుంది. జనాల్లో వారికి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు కూడా సినీ నటులకు ప్రాధాన్యతను ఇస్తుంటాయి. మరోవైపు తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిగా సినీ పరిశ్రమలో నటుడు పోసాని కృష్ణమురళికి పేరుంది. ఏపీలో ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన బహిరంగంగానే ఎండగట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన మద్దతు ఎవరికో ప్రకటించారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హైదరాబాద్ నగరవాసులను పోసాని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 35 ఏళ్ల నుంచి తాను ఎంతో మంది నాయకులను, ముఖ్యమంత్రులను చూశానని... కానీ, ఎన్టీఆర్ సీఎం అయ్యాక హైదరాబాదులో మత ఘర్షణలు తగ్గాయని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. నగర ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అది కేసీఆర్ వల్లే అని అన్నారు. నగరాభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.