Mohammad Siraj: టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి కన్నుమూత
- అనారోగ్యంతో మృతి చెందిన సిరాజ్ తండ్రి గౌస్
- ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సిరాజ్
- తండ్రి మరణంతో దిగ్భ్రాంతికి గురైన హైదరాబాదీ
ఇటీవల కాలంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు పితృవియోగం కలిగింది. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్న మహ్మద్ సిరాజ్ తీవ్ర విషాదానికి లోనయ్యాడు.
ప్రాక్టీస్ సెషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే తండ్రి పోయారన్న వార్తతో సిరాజ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. "ఈ ఘటనతో నిర్ఘాంతపోయాను. నా జీవితంలో అతిపెద్ద మద్దతు కోల్పోయాను. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ ఈ సమాచారం అందించారు. గుండె దిటవు చేసుకోవాలని కోరారు. నేను దేశానికి ఆడాలన్నది నా తండ్రి కల. ఆయన కోరిక తీర్చుతూ సంతోషపెడుతున్నానని భావిస్తున్నంతలో ఇలా జరిగిపోయింది" అని విషణ్ణ వదనంతో సిరాజ్ తన సందేశం వెలువరించాడు.
ప్రస్తుతం క్వారంటైన్ నిబంధనలు కఠినంగా ఉండడంతో తండ్రి అంత్యక్రియలకు సిరాజ్ భారత్ వచ్చే అవకాశాలు లేవు. హైదరాబాద్ లోని టోలీచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. సిరాజ్ ను క్రికెటర్ గా చేసేందుకు తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ ఎంతో కష్టపడ్డారు. 2016-17 రంజీ సీజన్ లో 41 వికెట్లు తీయడంతో సిరాజ్ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.