India: అమెరికాలో ఇప్పుడు జరుగుతోంది... ఇండియాలో 50 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ చేసి చూపింది: ప్రియాంకా గాంధీ
- యూఎస్ లో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్
- భారత్ కు 50 ఏళ్ల క్రితమే ఇందిరా గాంధీ ప్రధాని
- నాటి ఇందిర స్ఫూర్తి ప్రపంచ మహిళలను నడిపిస్తోందన్న ప్రియాంక
అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఓ మహిళ ఉపాధ్యక్షురాలిగా తొలిసారి ఎన్నిక కాబడ్డారని, కానీ ఇండియాలో 50 సంవత్సరాల క్రితమే ఇందిరా గాంధీని దేశ ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆమె, ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. అర్ద శతాబ్ధం కిందే ఇందిరా గాంధీ ఎంతో ధైర్య సాహసాలను చూపారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఇప్పుడు ప్రపంచ మహిళలను ముందుకు నడిపిస్తోందని అన్నారు.
కాగా, నవంబర్ 19, 1917న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించిన ఇందిర, భారతావనికి తొలి మహిళా ప్రధానిగా జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు, ఆపై జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984లో ఆమె హత్యకు గురి కాబడేంత వరకూ ప్రధానిగా కొనసాగారు. ఆ తరువాత మరే మహిళకూ భారత ప్రధానిగా పనిచేసే అవకాశం లభించలేదు.