Meteorite: నట్టింట్లోకి దూసుకొచ్చిన ఉల్క... కోటీశ్వరుడైన యువకుడు!
- ఇండోనేషియాలో ఘటన
- పెద్ద శబ్దంతో పైకప్పును చీల్చుకుంటూ వచ్చిన ఉల్క
- రూ.9.8 కోట్లకు విక్రయించిన ఇండోనేషియా యువకుడు
అదృష్టం కలిసి రావడమంటే ఇదే! అంతరిక్షం నుంచి విపరీతమైన వేగంతో దూసుకొచ్చిన ఉల్క ఓ యువకుడ్ని కోటీశ్వరుడ్ని చేసింది. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. సుమత్రాకు చెందిన జాషువా హుటాగలుంగ్ (33) శవపేటికలు తయారుచేస్తుంటాడు. గత ఆగస్టులో ఓ రోజు శవపేటిక తయారుచేస్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. ఇంటి వరండా పైకప్పును బద్దలు కొట్టుకుంటూ ఓ గట్టి రాయి వంటి వస్తువు ఆకాశం నుంచి రాలిపడింది. ఆ రాయి పడిన శబ్దానికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అదిరిపోయాయి. ఆ రాయి ఎంతో విశిష్టత కలిగిన అంతరిక్ష ఉల్కగా నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆ ఉల్కను అమ్మగా రూ.9.8 కోట్లు లభించాయట. దాంతో శవపేటికలు తయారుచేసుకుంటూ పొట్టపోసుకునే జాషువా ఉన్నపళాన సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. దీనిపై జాషువా మీడియాతో మాట్లాడుతూ, పనిచేసుకుంటుండగా భారీ పేలుడు వంటి శబ్దం వినిపించిందని, చూస్తే వరండా పైకప్పు పగలిపోయి కనిపించిందని తెలిపాడు. దగ్గరకెళ్లి చూస్తే అక్కడో రాయి వంటి వస్తువు కనిపించిందని, దాన్ని పట్టుకోగానే ఎంతో వేడిగా ఉందని వివరించాడు. దాంతో ఆ రాయిని జాషువా ఫేస్ బుక్ లో పోస్టు చేయగా విశేషమైన స్పందన లభించింది.
అమెరికాకు చెందిన అరుదైన వస్తు సేకర్త జారెడ్ కొలిన్స్ ఈ ఉల్క శిలను జాషువా నుంచి కొనుగోలు చేసి తన సహ వస్తు సేకర్త అయిన జే పియాటెక్ కు విక్రయించాడు. ప్రస్తుతం ఈ ఉల్కను పరిశోధనల నిమిత్తం అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ద్రవరూప నైట్రోజన్ లో భద్రపరిచారు. కాగా, తనకు ఈ ఉల్క ద్వారా వచ్చిన డబ్బు 30 ఏళ్ల పాటు శ్రమిస్తే వచ్చే డబ్బుతో సమానం అని జాషువా సంబరం వ్యక్తం చేశాడు.