Royal Enfield: అనుకరించాలనుకుంటే కుదరదు... ప్రత్యర్థులకు రాయల్ ఎన్ ఫీల్డ్ హితవు

Royal Enfield Indian seller Eicher Motors says imitation does not work

  • చేతులు కలిపిన హార్లే డేవిడ్సన్, హీరో మోటోకార్ప్
  • హైనెస్ మోడల్ రిలీజ్ చేసిన హోండా
  • మార్కెట్ కంటే తాము 10 మెట్లు పైనున్నామన్న ఎన్ ఫీల్డ్

భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు తిరుగులేని ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా రాయల్ ఎన్ ఫీల్డ్ తయారీ బుల్లెట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తుంది. రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ భారీ మోటార్ సైకిల్ నేటికీ అమ్మకాల పరంగా తన మార్కును చాటుకుంటోంది. ఇటీవలే తీసుకువచ్చిన మెటియోర్ తో క్రూయిజర్ విభాగంలోనూ ఎన్ ఫీల్డ్ సవాల్ విసురుతోంది.

ప్రస్తుతం భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బ్రాండ్ తో అమ్మకాలు సాగిస్తున్న ఐషర్ మోటార్స్ తన ప్రత్యర్థులకు హితవు పలికింది. ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ, తమను అనుకరించాలనుకుంటే అది కుదిరే పనికాదని ప్రత్యర్థులకు స్పష్టం చేశారు. తమ కంపెనీ మార్కెట్ కంటే 10 మెట్లు పైనే ఉందని అన్నారు.

"జనాలు తమ సొంత పంథా ఎంచుకోకుండా అనుకరణకు మొగ్గు చూపుతుండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఒకర్ని అనుకరించాలంటే అది వర్కౌట్ కాదు. పైగా ఆ విధంగా కాపీ కొడితే అది ఒరిజినల్ వస్తువుకు ఇంకాస్త మేలు చేస్తుంది. కొందర్ని చూస్తుంటే.. మేం చేతులెత్తేశాం, అందుకే మిమ్మల్ని కాపీ కొడుతున్నాం అన్నట్టు ఉంటుంది" అని విమర్శించారు.

భారత్ లో కొన్నాళ్లకిందట ప్రవేశించిన అంతర్జాతీయ బైక్ దిగ్గజం హార్లే డేవిడ్సన్ దేశంలో ఆశించిన అమ్మకాలు లేకపోవడంతో స్వీయ కార్యకలాపాలు నిలిపివేసి, దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ తో చేతులు కలిపింది. మరోవైపు, హోండా సంస్థ హైనెస్ పేరుతో మరో భారీ బైక్ తీసుకువచ్చింది. వీటితో రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీ ఎదురవుతుందన్న నేపథ్యంలో ఐషర్స్ మోటార్స్ ఎండీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News