CPM: ఏపీ బీజేపీ నేతలు మానవత్వానికే మచ్చ తెస్తున్నారు: సీపీఎం మధు
- పోలీసుల దుర్మార్గాన్ని సమర్ధించేలా మాట్లాడుతున్నారు
- ఆత్మహత్యలకు మతోన్మాదాన్ని పులమడం దారుణం
- పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ అంశం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు దారుణంగా మాట్లాడారంటూ సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు మానవత్వానికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసుల దౌర్జన్యానికి ఒక సామాన్య కుటుంబం బలైతే ప్రజల పక్షాన నిలబడాల్సిన నాయకులు... పోలీసుల దుర్మార్గాన్ని సమర్థించేలా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు.
మానవత్వాన్ని పక్కనపెట్టి... మతోన్మాదాన్ని పులమడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన ఇద్దరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిద్దరి బెయిల్ ను రద్దు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. దోషులు తప్పించుకోకుండా అత్యున్నత స్థాయి బృందంతో దర్యాప్తు చేయించాలని కోరారు.