MPL Sports: 2023 వరకు టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ గా 'ఎంపీఎల్ స్పోర్ట్స్'

MPL Sports ventured with BCCI as Teamindia new kit sponsor

  • నైకీతో ముగిసిన ఒప్పందం
  • భారత క్రికెట్ జట్టుకు కొత్త కిట్ స్పాన్సర్
  • 'ఎంపీఎల్ స్పోర్ట్స్' ను ఎంపిక చేసిన బీసీసీఐ

టీమిండియా ఆటగాళ్లు ఉపయోగించే కిట్లు, జెర్సీల కోసం కొత్త స్పాన్సర్ వచ్చింది. ఇకపై భారత క్రికెట్ ఆటగాళ్లకు 'ఎంపీఎల్ స్పోర్ట్స్' సంస్థ అధికారిక కిట్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. 'ఎంపీఎల్ స్పోర్ట్స్' తో తమ ఒప్పందం 2023 వరకు కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.

కాగా, ఇప్పటివరకు టీమిండియా కిట్ స్పాన్సర్ గా అంతర్జాతీయ క్రీడా ఉపకరణాల సంస్థ నైకీ వ్యవహరించింది. 2016 నుంచి 2020 వరకు స్పాన్సర్ షిప్ కోసం 'నైకీ' బీసీసీఐకి రూ.370 కోట్లు చెల్లించింది. 'నైకీ'తో ఒప్పందం ముగియడంతో టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ గా 'ఎంపీఎల్ స్పోర్ట్స్' ను బోర్డు ఎంపిక చేసింది.

'ఎంపీఎల్' సంస్థ భారత పురుషుల జట్టుకు మాత్రమే కాదు, జాతీయ మహిళల జట్టు, అండర్-19 ఇండియా జట్టుకు కూడా కిట్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు నవంబరు 2న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది.

'ఎంపీఎల్' సంస్థ ఇప్పటికే టీమిండియా ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలు రూపొందించిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టూర్ లో కోహ్లీ సేన కొత్త జెర్సీల్లో కనువిందు చేయనుంది. కిట్లు, జెర్సీలు, ఇతర క్రికెట్ దుస్తులే కాకుండా, 'ఎంపీఎల్' సంస్థ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మాస్కులు, ఇతర ఉపకరణాలను కూడా ఆటగాళ్లకు అందించనుంది.

  • Loading...

More Telugu News