Google: లోన్లు ఇస్తామంటూ ఊరిస్తున్న నాలుగు యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్
- స్వల్పకాలిక రుణాలు ఆఫర్ చేస్తున్న యాప్ లు
- అధిక వడ్డీ రేట్లతో రుణాలు
- నిబంధనల కొరడా ఝుళిపించిన గూగుల్
ఆన్ లైన్ లో రుణాలు అందించే నాలుగు సంస్థలకు చెందిన యాప్ లపై గూగుల్ కొరడా ఝుళిపించింది. అధిక వడ్డీరేట్లపై స్వల్ప కాలిక రుణాలు అందచేస్తున్న ఈ నాలుగు యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ ల కార్యకలాపాలు తమ పాలసీకి విరుద్ధంగా ఉన్నాయని గూగుల్ పేర్కొంది. గూగుల్ నిర్ణయం అనంతరం ప్లేస్టోర్ నుంచి ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, స్నాప్ ఇట్ లోన్ అనే నాలుగు యాప్ లు అదృశ్యమయ్యాయి.
దీనిపై గూగుల్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, తమ గూగుల్ ప్లే డెవలపర్ పాలసీలు యూజర్ల భద్రతకు పెద్దపీట వేసేలా రూపొందించామని తెలిపారు. ఇటీవలే తాము ఆర్థిక వ్యవహారాలకు చెందిన పాలసీని విస్తరించామని, తద్వారా యూజర్లు మోసపూరితమైన, దోచుకునే విధంగా ఉండే వ్యక్తిగత రుణాల బారి నుంచి రక్షణ పొందుతారని వివరించారు. ఈ యాప్ లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మరోపక్క, గూగుల్ ఆగ్రహానికి గురైన ఈ నాలుగు యాప్ లకు భారత్ లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన చట్టబద్ధత లేదని తెలుస్తోంది.