చలిలో వణికిపోతూ అర్ధరాత్రి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌.. వీడియో ఇదిగో

17-11-2020 Tue 13:17
  • పెరిగిన చలి తీవ్రత
  • పట్టువదలకుండా రాజమౌళి షూటింగ్
  • హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌
RRR shoting video goes viral

లాక్‌డౌన్ అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమా పనులు మళ్లీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటీవల చలి తీవ్రత విపరీతంగా నమోదవుతుండడంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అయితే, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా బృందం మాత్రం పట్టువీడకుండా సినిమా షూటింగు పనుల్లో బిజీగా పాల్గొంటోంది.

గత వారం ఓ అర్ధరాత్రి పూట చిత్రీకరించిన షూటింగుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న అసలుసిసలైన ఈ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఓ ప్రత్యేక సెట్‌ వేసి మిగిలిన షూటింగ్‌ భాగాన్ని రాజమౌళి తీస్తున్నారు. తాజాగా, బయటకు వచ్చిన ఈ వీడియోలో దర్శకుడు రాజమౌళి, కెమెరామన్‌ సింథిల్‌తోపాటు ఆ సినిమా యూనిట్‌ సభ్యులు కనపడుతున్నారు. వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, చ‌లికి వ‌ణికిపోతూ షూటింగ్ లో పాల్గొన్నారు.