New Delhi: రాజధానిలో మరోసారి కరోనా ఉద్ధృతి... సీఏపీఎఫ్ నుంచి 75 మంది డాక్టర్లను ఢిల్లీకి రప్పిస్తున్న కేంద్రం!
- ఢిల్లీలో మూడవ కరోనా వేవ్
- పలు రాష్ట్రాల నుంచి వైద్యుల తరలింపు
- కరోనాను ఎదుర్కోవడంలో సహకరించాలని కేంద్రం నిర్ణయం
ఢిల్లీలో కరోనా మూడవ వేవ్ కొనసాగుతూ, కేసుల సంఖ్య పెరిగిపోయిన వేళ, సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)కు చెందిన 75 మంది వైద్యులు, 250 మంది పారా మెడికల్ సిబ్బంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం నియమించబడ్డారు. కేంద్ర హోమ్ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరంతా సాధ్యమైనంత త్వరగా హస్తినకు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న సీఏపీఎఫ్ యూనిట్ల నుంచి వీరిని ఢిల్లీకి పంపుతున్నామని, అసోం నుంచి తమిళనాడు వరకూ పలు ప్రాంతాల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది తక్షణం న్యూఢిల్లీకి రానున్నారని, వీరిలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వైద్య సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించారు. వాణిజ్య విమానాల్లో వారు వస్తున్నారని, వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లనూ ఇప్పటికే పూర్తి చేశామని ఢిల్లీ వైద్యాధికారులు వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల మధ్య కరోనాపై సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అంతకుముందు హోమ్ శాఖ కార్యదర్శి అజ్ కుమార్ బిర్లా, ఐసీఎంఆర్, డీఆర్డీఓ అధికారులు సమావేశమై, ఢిల్లీ సర్కారుకు కరోనాను ఎదుర్కోవడంలో పూర్తి సహాయాన్ని అందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే సీఏపీఎఫ్ వైద్యులు, సిబ్బందిని దేశ రాజధానికి పంపాలన్న నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది.