Congress: కాంగ్రెస్ లో చిచ్చు... కపిల్ సిబాల్ పై విరుచుకుపడ్డ అశోక్ గెహ్లాట్!
- వ్యక్తిగతంగా సీట్లను తెచ్చుకోవడంలో విఫలం
- అంతర్గత విషయాలు మీడియా ముందుకు ఎందుకు?
- ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ వస్తున్నామన్న గెహ్లాట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీలతో పోలిస్తే, వ్యక్తిగతంగా సీట్లను తెచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, బహిరంగంగానే విమర్శలు గుప్పించిన వేళ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విరుచుకుపడ్డారు. పార్టీలోని అంతర్గత విషయాలను మీడియా ముందు ఎందుకు చెబుతారంటూనే, కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదని, ఆయన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల అందరి సెంటిమెంట్ నూ దెబ్బతీసేలా మాట్లాడారని నిప్పులు చెరిగారు.
సోనియా గాంధీ నాయకత్వంలో ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ వస్తున్నామని, గత నాలుగేళ్లలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని గుర్తు చేసిన గెహ్లాట్, పార్టీ విధానాలు, కార్యకలాపాలు తిరిగి పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తాయని అన్నారు. ఇటువంటి కష్టాలను ఎన్నింటినో ఎదుర్కొని 2004లో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సోనియా వంటి నాయకురాలు పార్టీని నడిపించడం ఎంతో గర్వకారణమని తన ట్విట్టర్ ఖాతాలో గెహ్లాట్ వ్యాఖ్యానించారు.