Corona Virus: కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టడం ప్రారంభించి నేటికి ఏడాది!
- గతేడాది నవంబరు 17న హుబేయి ప్రావిన్సులో వెలుగు చూసిన కేసు
- వైరస్ ఉనికి ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై భిన్నాభిప్రాయాలు
- భారత్‌లో ఈ ఏడాది జనవరి 30న తొలి కేసు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఈ భూమ్మీదికి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతోంది. నిజానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, చైనా ప్రభుత్వ సమాచారాన్ని ఉదాహరిస్తూ గతేడాది సరిగ్గా ఇదే రోజున (నవంబరు 17)న వైరస్ వెలుగు చూసినట్టు హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ రాసుకొచ్చింది.
గతేడాది సరిగ్గా ఇదే రోజున హుబేయి ప్రావిన్సులో 55 ఏళ్ల వ్యక్తిలో తొలుత కరోనా వైరస్ వెలుగు చూసిందని, అదే తొలి కేసు అని పేర్కొంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం డిసెంబరు 8న తొలి కేసు నమోదైనట్టు చెబుతోంది. ‘ది లాన్సెట్’ అయితే డిసెంబరు 1న తొలి కేసు వెలుగు చూసినట్టు పేర్కొంది.
వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో రోజుకు ఐదు కేసులు నమోదయ్యేవి. డిసెంబరు 15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. తొలుత ఇవి మామూలు కేసులేనని వైద్యులు భావించారు. అయితే, హుబేయికి చెందిన ఓ వైద్యుడు వైరస్ అసలు స్వరూపాన్ని గుర్తించాడు.
అది మామాలు వైరస్ కాదని, ఇదో కొత్తరకం వైరస్ అని, అప్రమత్తం కాకుంటే ప్రపంచం మొత్తాన్ని కబళించేస్తుందని హెచ్చరించాడు. ఈ వైరస్ గబ్బిలం నుంచి కానీ, మరేదైనా జంతువు నుంచి కానీ మానవులకు సోకి ఉంటుందని చెబుతున్నారు. కచ్చితంగా ఎలా వచ్చిందన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. మరోపక్క, ఈ వైరస్ బారినపడిన తొలి వ్యక్తి (పేషెంట్ జీరో) ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు.
హుబేయి ప్రావిన్సులో వెలుగు చూసిన ఈ భయానక వైరస్ ఆ తర్వాత మెల్లగా ప్రయాణించి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. చిన్నదేశం, పెద్ద దేశం అన్న తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని వణికించింది, ఇంకా వణికిస్తోంది. దాని దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా 5.50 కోట్ల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడగా, ప్రాణనష్టం కూడా భారీగానే జరిగింది. 13 లక్షల మందికిపైగా ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక ఈ ఏడాది జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదవడంతో, భారత్‌లో ఈ వైరస్ ఉనికి వెలుగులోకి వచ్చింది.