Punjab: యూరియా రాకుంటే భారీ నష్టం... గూడ్స్ రైళ్లు తిప్పాలంటున్న పంజాబ్!
- సెప్టెంబర్ 24 నుంచి నిలిచిన రైళ్లు
- వెంటనే గోధుమ పంటకు యూరియా అవసరం
- సరకు రవాణా రైళ్లు తిప్పాలంటున్న పంజాబ్
పంజాబ్ రాష్ట్రంలో సరకు రవాణా రైళ్లను నిలిపివేసిన తరువాత, ఈ సీజన్ లో గోధుమ పంటకు అవసరమైన యూరియా సరఫరా జరగలేదు. దీంతో తమకిప్పుడు అత్యవసరంగా 8 లక్షల టన్నుల యూరియా కావాల్సి వుందని, అటు ఖరీఫ్, ఇటు రబీ సీజన్ లకు ఎరువుల సరఫరా అత్యవసరమని, వెంటనే రైళ్లను పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ప్రస్తుతం గోధుమ పంట చేతికందే దశలో ఉందని, ఈ నెలలో వాడకానికి 4 లక్షల టన్నుల యూరియా తక్షణం అందాల్సి వుందని పంజాబ్ రాష్ట్ర ఫర్టిలైజర్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బల్ దేవ్ సింగ్ వెల్లడించారు. అక్టోబర్ లో తమ రాష్ట్రానికి ఎరువుల కోటా కింద 13 వేల టన్నులు రావాల్సి వుండగా, ఇంతవరకూ అందలేదని, వెంటనే రైతులకు యూరియాను అందించకుంటే, దిగుబడి తగ్గిపోతుందని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గోధుమ పంట 70 శాతం సాగు పూర్తయిందని, ఇప్పటివరకూ అవసరమైన యూరియాలో 22 శాతం మాత్రమే రైతులకు అందిందని, మొత్తం 35 లక్షల హెక్టార్ల పంటకు ఈ రబీ సీజన్ లో యూరియాను అందించాల్సి వుందని బల్ దేవ్ వెల్లడించారు. కాగా, సెప్టెంబర్ 24న రైతులు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, రైల్ రోకోను ప్రారంభించిన తరువాత, గూడ్స్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆపై 21న రైల్ రోకో నిరసనలను రైతులు నిలిపివేసినా, సర్వీసుల పునరుద్ధరణ మాత్రం జరుగలేదు.