ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ వెయిటింగ్!

16-11-2020 Mon 09:28
  • 'ఆర్ఆర్ఆర్' పూర్తిచేసే పనిలో ఎన్టీఆర్ 
  • తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో
  • ఫిబ్రవరి నుంచి సెట్స్ కి వెళ్లే సినిమా
  • కథానాయికగా కీర్తి సురేశ్ ఎంపిక?  
Trivikram waiting for NTR

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గత జనవరిలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. దీని తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయాల్సి వుంది. అయితే, లాక్ డౌన్ కారణంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ వాయిదా పడడంతో ఈ ప్రాజక్టు కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' పూర్తవడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు. అది పూర్తయితేనే కానీ త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ కాలేడు.

దీంతో ఈలోగా ఓ చిన్న బడ్జెట్టు చిత్రాన్ని చేయాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అందుకు స్క్రిప్టుతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరిగిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ వార్తలలో వాస్తవం లేదట. ఎన్టీఆర్ సినిమా కన్నా ముందు మరో సినిమా చేసే ఉద్దేశం త్రివిక్రమ్ కి లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ చిత్రం షూటింగును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నన్నారట. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటారు. ఇందులో కథానాయికగా మొదట్లో పూజ హెగ్డేను అనుకున్నప్పటికీ, తాజాగా కీర్తి సురేశ్ ని తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో కలసి నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తారు.