Indians: దుబాయ్ లో మనవాళ్లదే 'రియల్' హవా!

Indians tops Dubai real estate investments charts
  • నివేదిక విడుదల చేసిన దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంట్
  • దుబాయ్ రియల్ రంగంలో 5,246 మంది భారతీయులు
  • భారతీయుల పెట్టుబడి 10.89 బిలియన్ దిర్హామ్స్
ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. వ్యాపారాలు, కీలక పదవులు ఇలా అనేక విధాలుగా భారతీయులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ మనవాళ్లదే హవా అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ రియల్ పెట్టుబడుల్లో భారతీయులు టాప్ లో ఉన్నారట. లేటెస్ట్ గా విడుదలైన దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంట్ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో 5,246 మంది భారతీయులు పెట్టుబడులు పెట్టారట. గల్ఫ్ దేశాల వారు కూడా ఈ విషయంలో మనవాళ్ల తర్వాతే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందినవారు 5,172 మంది రియల్ పెట్టుబడుల రంగంలో ఉన్నారు.

సౌదీ అరేబియా నుంచి 2,198 మంది, చైనా నుంచి 2,096 మంది, బ్రిటన్ నుంచి 2,088 నుంచి, పాకిస్థాన్ నుంచి 1,913 మంది, ఈజిప్ట్ నుంచి 955 మంది, జోర్డాన్ నుంచి 855 మంది, అమెరికా నుంచి 682 మంది, కెనడా నుంచి 678 మంది దుబాయ్ రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు తాజా నివేదిక చెబుతోంది.

మనవాళ్లు సంఖ్యాపరంగానే కాదు, పెట్టుబడి విలువ పరంగానూ టాప్ లోనే ఉన్నారు. భారతీయుల పెట్టుబడి విలువ 10.89 బిలియన్ దిర్హామ్స్ కాగా, ఎమిరేట్ వాసులు 8.1 బిలియన్ దిర్హామ్స్ తో రెండోస్థానంలో ఉన్నారు. నిలకడగా వృద్ధి సాధిస్తున్న దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. ఈ ఏడాది చివరి భాగంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని దుబాయ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Indians
Dubai
Real Estate
Investments

More Telugu News