Drunk Driving: రైల్వే ట్రాకునే రోడ్డు అనుకుని కారుతో దూసుకెళ్లిన తాగుబోతు యువతి!

Drunk woman drives her car on railway track in Spain

  • స్పెయిన్ లోని మలగాలో ఘటన
  • మద్యం మత్తులో అయోమయానికి గురైన యువతి
  • ఒకటిన్నర కిలోమీటరు పట్టాలపైనే కారు ప్రయాణం

మద్యం మత్తు తలకెక్కితే విచక్షణ కోల్పోతారనడానికి అనేక దృష్టాంతాలున్నాయి. స్పెయిన్ లోని ఓ తాగుబోతు యువతి కూడా మద్యం మత్తులో రైల్వే ట్రాక్ కు, రోడ్డుకు తేడా తెలుసుకోలేకపోయింది. రైలు పట్టాలనే రోడ్డుగా భావించి తన కారుతో దూసుకుపోయింది. స్పెయిన్ లోని మలగా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మద్యం మత్తులో కారు నడుపుకుంటూ వస్తున్న 25 ఏళ్ల యువతి క్రాసింగ్ వద్ద తికమకపడింది. రోడ్డు మీదికి పోనివ్వాల్సిన కారును రైల్వే ట్రాకుపైకి మళ్లించింది. అదే రోడ్డు అనుకుని కారును ముందుకు ఉరికించింది. అయితే, కారు టైర్లకు మూడు పంచర్లు కావడంతో ఆ మహిళా తాగుబోతు ప్రయాణానికి బ్రేక్ పడింది. ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణించిన అనంతరం ఓ టన్నెల్ వద్ద ఆమె కారు నిలిచిపోయింది.

ఇది గమనించిన స్థానిక మెట్రో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ కారును రైలు పట్టాలపై నుంచి తొలగించారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు ఆ లైన్లో రైళ్లకు అంతరాయం కలిగింది. కాగా, ఆ యువతికి బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహిస్తే అనుమతించిన మోతాదు కన్నా మూడు రెట్లు అధికంగా మద్యం సేవించినట్టు వెల్లడైంది.

నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్, మద్యం ఓవర్ డోస్ నేపథ్యంలో మలగా పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. ఆమెపై క్రిమినల్ అభియోగాలు మోపారు. రైలు పట్టాలపై ఆమె కారు ప్రయాణం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News