ఎన్టీఆర్ తదుపరి సినిమాలో కీర్తి సురేశ్?

14-11-2020 Sat 09:20
  • 'రంగ్ దే', 'సర్కారు వారి పాట' చిత్రాలలో కీర్తి  
  • తమిళంలో రెండు, మూడు సినిమాలలో నాయిక
  • ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో తాజాగా ఛాన్స్    
Keerti Suresh to play lead role in NTRs next

'మహానటి' సినిమాతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న హోమ్లీ హీరోయిన్ కీర్తి సురేశ్ అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ కూడా పలు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో రెండు, మూడు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే' సినిమాలో నటిస్తోంది. అలాగే, త్వరలో ప్రారంభమయ్యే మహేశ్ బాబు సినిమా 'సర్కారు వారి పాట' చిత్రంలో కూడా కథానాయికగా నటించనుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం కూడా ఈ అందాలతారకు తాజాగా వచ్చినట్టుగా తెలుస్తోంది.  

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్న ఎన్టీఆర్ ఆ తరువాత తన చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా రెడీ అయింది. అయితే, 'ఆర్ఆర్ఆర్' షూటింగు ఆలస్యం కావడం వల్ల ఇది సెట్స్ కి వెళ్లడానికి మరో మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు.

ఇక ఇందులో కథానాయిక పాత్రకు కీర్తి సురేశ్ బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఒకవేళ ఇది ఖరారైతే కనుక కీర్తి రేంజ్ టాలీవుడ్ లో మరింత పెరుగుతుందనే చెప్పచ్చు!