Vijayasai Reddy: ఏ ప్రభుత్వానికైనా నిధుల కొరత ఉంటుంది.. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంది: విజయసాయిరెడ్డి
- అనుకున్న సమయానికే పోలవరంను పూర్తి చేస్తాం
- విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి
- ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నాం
అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. విశాఖలో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ మారథాన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన ఈ మేరకు స్పందించారు.
మరోవైపు విశాఖ జిల్లా వైసీపీ నేతల మధ్య పంచాయతీ సీఎం జగన్ దృష్టికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల జిల్లా సమీక్ష సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత అంశాలను బహిరంగ వేదికలపై మాట్లాడవద్దనే నియమావళిని ఎవరూ ఉల్లంఘించవద్దని విజయసాయి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేతల మధ్య విభేదాలు లేవని అన్నారు. విభేదాలు ఉన్నాయనేది మీడియా సృష్టి మాత్రమే అని చెప్పారు. నాయకుల మధ్య జరిగిన చర్చను విభేదాల కోణంలో చూడొద్దని అన్నారు.