సుధ కొంగర దర్శకత్వంలో కార్తీ!

13-11-2020 Fri 18:14
  • కోలీవుడ్ లో రాణిస్తున్న సుధ కొంగర 
  • గతంలో వెంకటేశ్ హీరోగా 'గురు' చిత్రం
  • తాజాగా సూర్యతో 'ఆకాశం నీ హద్దురా'
  • సుధ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తీ  
Sudha Kongara to direct Karthi

తాజాగా అన్నతో ఓ చిత్రాన్ని చేసిన దర్శకురాలు తన తదుపరి చిత్రాన్ని అతని తమ్ముడితో చేస్తోంది. తనే సుధా కొంగర! తమిళ చిత్రసీమలో దర్శకురాలిగా మంచి పేరుతెచ్చుకుంటున్న తెలుగమ్మాయి సుధ కొంగర. ఆమధ్య వెంకటేశ్ తో తెలుగులో 'గురు' చిత్రాన్ని చేసి ప్రశంసలందుకున్న సుధ తమిళంలోనే తన కెరీర్ని కొనసాగిస్తోంది.  

తాజాగా సూర్య హీరోగా సుధ రూపొందించిన 'సూరారై పొట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా') ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైంది. దీనికి మంచి ఆదరణ లభిస్తుండడంతో పాటు సుధ దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ చిత్రం తర్వాత ఆమె తన తదుపరి చిత్రాన్ని వాస్తవానికి అజిత్ తో చేయాల్సి వుంది. అయితే, అజిత్ చేస్తున్న 'వాలిమై' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఇంకా పూర్తికాలేదు. దీంతో ఈలోపు మరో చిత్రాన్ని చేయాలని సుధ నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో సూర్య తమ్ముడు కార్తీతో ఆమె ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కార్తీకి ఆమె కథ చెప్పినట్టు, నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఆమె ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో పడ్డట్టు చెన్నై సమాచారం.