డ్రగ్స్ కేసు... విచారణకు హాజరైన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్

13-11-2020 Fri 17:02
  • డ్రగ్స్ కేసులో అర్జున్ రాంపాల్ ప్రియురాలి సోదరుడు అరెస్ట్
  • అర్జున్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు
  • 11న విచారణకు హాజరైన అర్జున్ ప్రియురాలు
Arjun Rampal attends for NCB questioning

డ్రగ్స్ భూతం బాలీవుడ్ లో పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా నటుడు అర్జున్ రాంపాల్ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఎన్సీబీ సమన్లను పంపించిన నేపథ్యంలో ఈ ఉదయమే ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి అర్జున్ వెళ్లాడు. ప్రస్తుతం ఆయనను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు.

అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియేలా దెమెత్రియాడెస్ సోదరుడు అగిసిలావోస్ దెమెత్రియాడెస్ కు మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నట్టు నిర్ధారించిన ఎన్సీబీ ఇటీవల అతన్ని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. సోదాల తర్వాత అర్జున్ కు, అతని ప్రియురాలికి సమన్లు జారీ చేసింది.

ఈనెల 11న ఎన్సీబీ విచారణకు గాబ్రియేలా హాజరైంది. ఈరోజు అర్జున్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకునే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తిలను ఎన్సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.