ప్రేమ వివాహం చేసుకోబోతున్న ప్రభుదేవా

13-11-2020 Fri 12:57
  • బంధువుల అమ్మాయి ప్రేమలో ప్రభుదేవా
  • త్వరలోనే పెళ్లి అంటూ జాతీయ మీడియాలో కథనాలు
  • ఇంత వరకు ఈ అంశంపై స్పందించని ప్రభుదేవా
Prabhudeva to marry his relative

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడ్డాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ నటి నయనతారతో గతంలో ప్రభుదేవా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. నయనతారను పెళ్లాడేందుకు ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ప్రభు, నయన్ ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు విఘ్నేశ్ తో నయనతార ప్రేమలో పడింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అప్పటి నుంచి సింగిల్ గానే ఉండిపోయిన ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మాయి ఆయన బంధువేనని సమాచారం. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోంది... త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ప్రభుదేవా ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో 'రాధే' సినిమాను ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు.