Lucy Letby: చూడ్డానికి అందంగా ఉన్న ఈ నర్సు నిజంగా రాక్షసే... పసికందుల పాలిట మృత్యుదేవత!
- ఇంగ్లాండ్ లో ఓ నర్సు కిరాతకాలు
- పసికందులను చంపేస్తున్న వైనం
- అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
వైద్యులు, నర్సులను ప్రాణదాతలుగా కొనియాడడంలో అతిశయోక్తి లేదు. ఎంతో పవిత్రమైనది వైద్య వృత్తి. డాక్టర్లు దేవుళ్లయితే, రోగులను కంటికిరెప్పలా చూసుకునే నర్సులు దేవతలు! కానీ ఈ బ్రిటీష్ నర్సు ఆ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించింది. తన రాక్షస ప్రవృత్తి కారణంగా అప్పుడే పుట్టిన చిన్నారులను దారుణంగా అంతమొందించింది.
ఆ కిరాతకురాలి పేరు లూసీ లెట్బీ. వయసు 30 ఏళ్లు. చెస్టర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంగ్లాండ్ లోని చెస్టర్ సిటీలో ఉన్న ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నవజాత శిశువుల బాగోగులు చూసుకోవడం నర్సుగా ఆమె విధి. అయితే, 2015 నుంచి 2016 వరకు ఆమె 8 మంది పసికందులను కడతేర్చింది. మరో 10 మంది శిశువులను కూడా చంపేందుకు ప్రయత్నించింది.
పలువురు శిశువులు ఆశ్చర్యకర రీతిలో ఊపిరితిత్తులు, గుండె వైఫల్యంతో చనిపోయినట్టు ఆసుపత్రి వర్గాలు గుర్తించాయి. అంతేకాదు, మరణించిన శిశువుల చేతులు, కాళ్లపై మచ్చలు గమనించిన వైద్య నిపుణులు విస్మయానికి గురయ్యారు.
ఈ క్రమంలో పోలీసులు లూసీ లెట్బీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు. గతంలోనూ నర్సు లూసీపై ఇవే ఆరోపణలు రాగా, పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేకపోవడంతో ఆమెను నిరపరాధిగా కోర్టు విడుదల చేసింది. ఈసారి పోలీసులు బలమైన ఆధారాలు సంపాదించి ఆమెను కోర్టు బోనెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.