Ramachandra Rao: నంద్యాల ఆత్మహత్యల వ్యవహారంలో కీలక పరిణామం... టీడీపీకి రాజీనామా చేసిన లాయర్ రామచంద్రరావు
- నంద్యాల ఘటనలో ఇద్దరు పోలీసుల అరెస్ట్
- ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- బెయిల్ వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు
- టీడీపీ లాయర్ కారణంగానే నిందితులకు బెయిల్ వచ్చిందన్న సీఎం
నంద్యాల ఆత్మహత్యల కేసులో నిందితులైన పోలీసులకు బెయిల్ రావడానికి కారణం టీడీపీకి చెందిన న్యాయవాదేనంటూ అధికార వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నంద్యాల నిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించిన న్యాయవాది రామచంద్రరావు టీడీపీకీ రాజీనామా చేశారు.
ప్రభుత్వ వైఖరి కారణంగానే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసులకు బెయిల్ వచ్చేలా చేసింది టీడీపీకి చెందిన న్యాయవాదేనని సీఎం జగన్ సహా వైసీపీ నాయక గణం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయవాది రామచంద్రరావు టీడీపీకి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరింత ఆసక్తికర పరిణామం ఏమిటంటే... ఈ ఇద్దరు పోలీసుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసు శాఖే కోర్టులో పిటిషన్ వేసింది. నంద్యాల కోర్టులో ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.