Whatsapp: ఎట్టకేలకు భారత్ లో అందుబాటులోకొచ్చిన 'వాట్సాప్ పేమెంట్స్'

Whatsapp introduces payments feature in India

  • వాట్సాప్ లోనూ యూపీఐ ఆధారిత చెల్లింపులు
  • నగదు పరిమితి రూ.1 లక్ష
  • వాట్సాప్ కు అనుమతి మంజూరు

ఇప్పుడంతా ఆన్ లైన్ లావాదేవీలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, ఫోన్ ద్వారా చెల్లింపులతో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా, వాట్సాప్ కూడా వాట్సాప్ పేమెంట్స్ పేరిట ఆన్ లైన్ చెల్లింపుల రంగంలో ప్రవేశించింది. ఎప్పుడో రెండేళ్ల కిందటే ఈ సదుపాయం తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నించినా, చట్టపరమైన అడ్డంకులు, కీలక అనుమతులు లభించేసరికి ఇన్నాళ్లు పట్టింది. భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ వాట్సాప్ కు తాజాగా అనుమతులు మంజూరు చేసింది.

వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను ఉపయోగించుకోవాలనుకునే వారు మొదట తమ బ్యాంక్ ఖాతాతో లింకైన ఫోన్ నెంబరు ద్వారా రిజిస్టర్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్ తో లింకైన నెంబరు, వాట్సాప్ నెంబరు ఒకటే అయ్యుండాలి. వాట్సాప్ సెట్టింగ్స్ లో ప్రత్యేకంగా పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చారు. దానిపై క్లిక్ చేస్తే బ్యాంకుల జాబితా దర్శనమిస్తుంది. నగదు పంపాల్సిన బ్యాంకును ఎంపిక చేసుకోగానే ఎస్సెమ్మెస్ తో అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపై యూపీఐ పాస్ కోడ్ సెట్ చేసుకోవాలి. ఇదివరకే యూపీఐ పాస్ కోడ్ ఉపయోగిస్తుంటే ఆ పాస్ కోడ్ వాట్సాప్ పేమెంట్స్ కు కూడా సరిపోతుంది.

ఇతర యూపీఐ ఆధారిత యాప్ ల తరహాలోనే దీనికి వ్యాలెట్ లో నగదు నిల్వ చేసుకోవాల్సిన పనిలేదు. యూపీఐ సాయంతో నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేయొచ్చు. దీంట్లో మరో సదుపాయం కూడా ఉంది. వాట్సాప్ పేమెంట్స్ నుంచి ఇతర పేమెంట్స్ యాప్ లకు కూడా నగదు బదిలీ చేయొచ్చు. అవతలి వ్యక్తి వాట్సాప్ పేమెంట్స్ లో రిజిస్టర్ కాకపోయినా వారి భీమ్, ఫోన్ పే, గూగుల్ పే యూపీఐ ఐడీ సాయంతో లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ఐడీ లేకపోతే, వాట్సాప్ పేమెంట్స్ లో రిజిస్టరై పాస్ కోడ్ పొందవచ్చు.

వాట్సాప్ పేమెంట్స్ లో నగదు బదిలీ పరిమితిని రూ.1 లక్షగా నిర్ణయించారు. ఇతర పేమెంట్ యాప్ ల్లో ఇదే తరహాలో నగదు పరిమితి ఉంది. వాట్సాప్ పేమెంట్స్ లో లావాదేవీలకు ఎలాంటి రుసుము అక్కర్లేదు.

కాగా, భారత బ్యాంకుల్లో ఖాతాలు ఉండి, మనదేశ ఫోన్ నెంబర్లు వినియోగిస్తున్న వారికే ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ ఫోన్ నెంబర్లతో వాట్సాప్ ఉపయోగిస్తున్నవారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. ప్రస్తుతానికి రెండు కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ సేవలు అందించాలని భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ వాట్సాప్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News