Mike Pompeo: ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ సిద్ధంగా లేని వేళ... మద్దతు కోసం 7 దేశాల టూర్ ను ప్రకటించిన మైక్ పాంపియో!
- ట్రంప్ ను విభేదిస్తున్న పలు దేశాలు
- ఫ్రాన్స్ సహా పలు దేశాలను చుట్టి రానున్న పాంపియో
- శుక్రవారం నుంచి పర్యటన
తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్, తన ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని వార్తలు వస్తున్న వేళ, ట్రంప్ కు మద్దతును కూడగట్టేందుకు అమెరికా విదేశాంగ మంత్రి 7 దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జో బైడెన్ కు శుభాభినందనలు చెబుతూ యూరప్ దేశాధినేతలు కాల్ చేసిన నేపథ్యంలో, పాంపియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
శుక్రవారం నాడు పారిస్ కు బయలుదేరనున్నానని, అక్కడి నుంచి ఇస్తాంబుల్, జార్జియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ దేశాలకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. తన పర్యటనలో ట్రంప్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ఆయా దేశాలతో మిత్రత్వం, సహాయ సహకారాలను ప్రస్తావించనున్నట్టు పాంపియో మీడియాకు వెల్లడించారు.
కాగా, ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాలు ట్రంప్ ను విభేదిస్తూ, బైడెన్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అమెరికాతో ద్వైపాక్షిక బంధం కొనసాగాలంటే, అధ్యక్షుడిగా బైడెన్ ఉండాలని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ట్రంప్ కు మిత్ర దేశాలుగా పేరున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, సౌదీ రాజు మహమ్మద్ బిన్ సుల్తాన్, టర్కీ అధ్యక్షుడు తయాపీ ఎర్డోగన్ తదితరులు కూడా బైడెన్ కు అభినందనలు తెలపడంతో జరిగిన నష్టాన్ని నివారించాలని పాంపియో భావిస్తూ, ఈ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు.