Corona Virus: ప్రపంచంలో 5 కోట్లు దాటిన కరోనా కేసులు!

Above 5 Crore Corona Cases in World

  • అక్టోబర్ లో అత్యధిక కేసులు
  • 21 రోజుల్లో కోటికి పైగా కొత్త కేసులు
  • యూరప్ దేశాల్లో ప్రతి మూడు రోజులకూ 10 లక్షల కేసులు
  • రోజురోజుకూ విజృంభిస్తున్న మహమ్మారి

గత సంవత్సరం చివరిలో ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా మహమ్మారి నిన్నటి వరకూ 5 కోట్ల మందికి సోకింది. గడచిన నెల రోజుల వ్యవధిలో పలు దేశాల్లో కరోనా రెండో వేవ్ ప్రారంభం కావడంతోనే కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని 'రాయిటర్స్' వార్తా సంస్థ పేర్కొంది. ఇక, గడచిన ఏడాది వ్యవధిలో అక్టోబర్ నెలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అయితే, ఏకంగా రోజుకు లక్షకు పైగా కేసులు వస్తుండటం గమనార్హం.

చాలా దేశాలు లాక్ డౌన్ నిబంధనలను సడలించడం, కరోనా నివారణకు ఇంతవరకూ వ్యాక్సిన్ రాకపోవడం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల నుంచి నాలుగు కోట్లకు పెరిగేందుకు 30 రోజుల సమయం పట్టగా, ఆపై 21 రోజుల వ్యవధిలోనే కేసులు మరో కోటి పెరిగి, ఐదు కోట్లకు చేరాయి. సగటున గత వారం రోజులుగా 5.40 లక్షల కొత్త కేసులు వస్తున్నాయి.

ఇక పలు దేశాల్లో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటంతో, వారి అంత్యక్రియల నిర్వహణ సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా రష్యా తదితర దేశాల్లో రహదారుల వెంట శ్మశానాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేక, తాత్కాలిక కొవిడ్ సెంటర్లను పలు దేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. యూరప్ లో ఇప్పటికే 1.20 కోట్లకు పైగా కరోనా కేసులుండగా, మొత్తం మరణాల్లో 24 శాతం సంభవించాయి. ప్రతి మూడు రోజులకూ యూరప్ దేశాల్లో 10 లక్షల వరకూ కొత్త కేసులు వస్తున్నాయంటే, పరిస్థితి ఎంత విషమిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News